హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కృషిని విదేశాల్లోని వారు కూడా అభినందిస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని అన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ కూడా చెప్పారని తెలిపారు. విలేకరుల సమావేశంలో మంత్రి ఈటెల మాట్లాడారు.
'రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాల్సిన అవసరంలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలు చేస్తున్నాం. ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాలన్న ఐసీఎంఆర్ తరువాత దాన్ని విరమించుకుంది. కరోనా టెస్ట్ ఖరీదైనది అందుకే ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతించలేదు. కరోనా మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా 7శాతం.. దేశంలో 3.2శాతం ఉండగా రాష్ట్రంలో 2.5 శాతం మాత్రమే. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ చెప్పింది. మరణాల రేటు తెలంగాణలో తక్కువగా ఉందని' మంత్రి వివరించారు.
'లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడం వల్లనే కరోనా సామాజిక వ్యాప్తి చెందలేదు. మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి. ప్రజల ప్రాణాలను కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో 22 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. కేంద్ర బృందాలు తెలంగాణ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశాయి. పాజిటివ్ కేసులు తగ్గిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారని' మంత్రి ఈటెల పేర్కొన్నారు.